కొత్తరకం కరోనా ఎఫెక్ట్ : బ్రిటన్ నుంచి భారత్‌కు విమానాల రద్దు
యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తం అయింది. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
డిసెంబరు 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. రేపు అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. అంతేగాక, యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది.
ఒకవేళ ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. మరోవైపు కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.