తిరిగి రాకెట్‌ పట్టనున్న పీవీ సింధు

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి బ్యాడ్మింటన్‌ టోర్నీలన్నీ రద్దు లేదా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ టైమ్ లో తెలుగు తేజం పీవీ సింధు డిప్రెషన్ కు గురైంది. ఎవరికి చెప్పకుండా అమెరికా చెక్కేసిందనే ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత ? అన్నది పక్కనపెడితే.. సింధు తిరిగి రాకెట్ పట్టుకోనుంది.

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఎనిమిది మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. గత ఒలింపిక్స్‌ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, బి.సాయి ప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప, ఎన్‌.సిక్కిరెడ్డి ఈ జట్టులో ఉన్నారు.
జనవరి 12-17 మధ్య జరిగే థాయిలాండ్‌ ఓపెన్‌తో వీరు తమ ప్రస్థానాన్ని తిరిగి ఆరంభిస్తారు. ఆ తర్వాత బ్యాంకాక్‌ ఓపెన్‌ (జనవరి 19-24), బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (జనవరి 27-31)లో పోటీపడతారు. వీరితో పాటు వ్యక్తిగత కోచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రైనర్లూ అక్కడికి వెళ్లనున్నారు.