కరోనా టీకా తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు
ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో భారీ ఎత్తున టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు.
టీకా తీసుకున్న సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. “టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నాను. టీకా వేసుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. నేను టీకా రెండో డోసు తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను” అని బైడెన్ తెలిపారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జోబైడెన్ మరోసారి అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.