మార్చిలోగా కేటీఆర్’కు ముఖ్యమంత్రి బాధ్యతలు

మంత్రి కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడతారనే ప్రచారం చాన్నాళ్ల నుంచి ఉంది. ఇప్పుడు దానికి ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారమ్. వచ్చే యేడాది మార్చిలోగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధత్యలు అప్పగిస్తారని మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ అన్నారు.

డోర్నకల్‌లో మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను బుధవారం రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మంత్రి కేటీఆర్‌ని కలిసి కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరు చేయాలంటూ విన్నవించిన విషయాన్ని ప్రస్తావించారు. కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ రెడ్యానాయక్‌ కామెంట్ చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం ఖాయం. ఆ క్రెడిట్ ని మంత్రి కేటీఆర్ ఖాతాలో వేసి.. వెంటనే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారనే ప్రచారం జరిగింది. తెరాస సీనియర్ నేతలు, పలువురు మంత్రులు కూడా సీఎం పోస్ట్ కి కేటీఆర్ అర్హుడని కితాబిచ్చారు. అయితే తెరాస లెక్కలు తారుమారయ్యాయ్.

దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసకు షాక్ తగిలింది. అక్కడ బీజేపీ గెలిచింది. గ్రేటర్ ఎన్నికల్లోనూ భాజాపా పుంజుకుంది. వంద స్థానాలని టార్గెట్ గా పెట్టుకున్న తెరాస 56 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో.. కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పగించడం మరింత ఆలస్యం కావొచ్చని అనుకున్నారు. కానీ.. మార్చిలోగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.