అలర్ట్ : ఏపీలోకి చేరిన కొత్తరకం కరోనా వైరస్

బ్రిటన్ లో బయటపడిన కొత్తరకం వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి చేరిందని చెప్పుకొంటున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళ క్వారంటైన్ నుంచి తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రి చేరింది. అయితే ఆమెని పట్టుకొని కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో రాజమండ్రి వాసులు వణికిపోతున్నారు. ఆమెకి వచ్చింది కొత్తరకం వైరస్ అని తేలితే తమ పరిస్థితి ఏంటీ ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహిళ రక్తపు నమూనాలని పూణె ల్యాబ్ కి పంపించారు. ఆ రిపోర్టులు వస్తేగానీ.. ఆమెకి వచ్చింది పాత కరోనా వైరస్ నా ? లేక కొత్త రకం వైరస్ నా ?? అన్నది తేలనుంది. అయితే ఈలోగా ఏపీలోకి కొత్తరకం వైరస్ వచ్చిసిందనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రి చేరిన సదరు మహిళ ఏ బోగిలో కూర్చుంది. ఎవరెవరిని కలిసింది అనేది ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది. వారికి కరోనా పరీక్షలు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ మహిళ సోకింది కొత్త రకం వైరస్ అయితే గనుక పరిస్థితి దారుణంగా ఉండనుంది.

మరోవైపు సదరు మహిళ తీరుపై జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఉంచిన క్వారంటైన్ లో ఉండక తప్పించుకొని రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ మహిళ విద్యావంతురాలు కూడా. భర్తతో కలిసి చాన్నాళ్లుగా రాజమండ్రి రామకృష్ణ నగర్ లో నివాసం ఉంటున్నారు. పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నట్టు తెలిసిందే. అయితే కరోనా లాక్‌డౌన్ తో ముందు భర్త.. ఆ తర్వాత భార్య లండన్ వెళ్లారని తెలిసింది. లండన్ నుంచి తిరిగి రాజమండ్రి చేరే క్రమంలో మహిళ క్వారంటైన్ నుంచి తప్పించుకొని రావడం.. ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది.