బోనస్ పేరిట ఉద్యోగులకి షాకిచ్చిన గోడాడీ
ప్రముఖ ఇంటర్నెట్ డొమెన్ రిజిస్టేషన్ సంస్థ ‘గోడాడీ’ ఉద్యోగులకి బోనస్ పేరిట షాక్ ఇచ్చింది. గోడాడీ సంస్థ ఉద్యోగులకు డిసెంబరు 14న ఓ మెయిల్ వచ్చింది. దానిలో ఉద్యోగులందరికీ హాలిడే బోనస్‌గా 650 డాలర్లు ప్రకటిస్తున్నట్లు ఆ మెయిల్లో ఉంది. దానిలో భాగంగా ఉద్యోగులంతా వారి వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని కోరగా వారంతా సంబంధిత సమాచారాన్ని ఇచ్చారు.
ఆ తర్వాత రెండ్రోజులకు గోడాడి సంస్థ ప్రధాన భద్రతాధికారి నుంచి మెయిల్ వచ్చింది. ‘ఇటీవల నిర్వహించిన భద్రతా పరీక్షలో (ఫిషింగ్ టెస్ట్) మీరంతా విఫలమైనందున భద్రతా అవగాహన శిక్షణలో మళ్లీ పాల్గొనాలి’ అని ఆ మెయిల్ సారాంశం. దీంతో ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. సాధారణంగా కొన్ని సంస్థలు భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. బోనస్ పేరిట గోడాడీ అదే చేసింది. కానీ ఇలాంటి సమయంలో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసినందుకు గోడాడీ సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ‘గోడాడీ’ సంస్థ ఉద్యోగులకు క్షమాపణ తెలిపింది.