సింగర్ సునీత పెళ్లి.. కొత్త డేటు ఫిక్స్ !
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని పెళ్లాడనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. పెళ్లి కూడా ఈ నెలలోనే ఉండనుంది. ఈ నెల 27న పెళ్లికి ముహూర్తం ఫిక్సయిందనే ప్రచారం జరిగింది. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? సునీత పెళ్లి రేపు (డిసెంబర్ 27) కాదట. వచ్చే నెలలో పెళ్లి జరగనుందని చెబుతున్నారు. జనవరి 9న ముహూర్తం ఫిక్సయిందని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. చాలా సింపుల్ గా పెళ్లి వేడుకని ప్లాన్ చేస్తున్నారని.. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి జరగనుందని తెలుస్తోంది.
సునీతకు 19 యేళ్ల వయసులోనే కిరణ్ తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త తీరుతో విసిగిపోయిన సునీత అతడితో విడాకులు తీసుకొంది. ఇక రెండో పెళ్లిపై సునీత స్పందిస్తూ.. ‘ప్రతితల్లి మాదిరిగానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలుకన్నాను. అదే సమయంలో నేను సంతోషంగా ఉండాలని ఆశించే వివేకంతో ఆలోచించే తల్లిదండ్రులు, పిల్లలు నా తోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నేను ఆనందించే మధుర క్షణాలు వచ్చాయి. మంచి స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా రామ్ నా జీవితంలోకి ప్రవేశించారు. త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం’ అని తెలిపిన సంగతి తెలిసిందే.