రజనీకాంత్ డిశ్చార్జ్. కానీ.. !
సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానీ కొన్ని సూచనలు, సలహాలు చెప్పారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. అన్నాత్తె షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు రజనీ వచ్చారు. ఈ నెలాఖరుకల్లా షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ప్రతిరోజూ 14 గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నారని తెలిసింది. ఇటీవల సెట్‌లో నలుగురికి కొవిడ్ రావడంతో దర్శకుడు శివ షూటింగ్ నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఈనెల 22న రజనీకాంత్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంతలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యం తలెత్తడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండ్రోజుల పాటు హాస్పటల్ లోనే ఉండటంతో రజనీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.