సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావడం కష్టం. బీజేపీ నేతనే సీఎం పీఠంపై కూర్చోబెడతారు అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే సంచలనాలకు తావులేకుండా.. ముందస్తు కూటమి ఒప్పందం ప్రకారం మరోసారి నితీష్ కుమార్ నే సీఎం ని చేశారు. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్ లో.. జేడీయూకు బీజేపీ షాక్ ఇచ్చింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీనిపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారు. తనకు సీఎం పదవి అక్కర్లేదు అంటున్నారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన నితీష్.. తనకు సీఎం పదవిపై ఆసక్తి లేదన్నారు.

‘బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సీఎం కుర్చికి నేను అంకితం కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని సంకీర్ణానికి తెలియజేశాను. కానీ వారు అంగీకరించలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత నేను మరో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఈ పదవి పట్ల నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు.. అక్కర్లేదు’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేస్తారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.