వీహెచ్ ఒంటరి పోరాటం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఒంటరిపోరాటం చేస్తున్నారు. అలాగని ఆయన చేస్తున్నది ప్రజా సమస్యలపై పోరాటం కాదు. తెలంగాణ పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పోటీ అరడజనుకుపైగా నేతలున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఎంపీలు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్యనే ఉంది. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతోంది. ఆయన పేరుని ఖరారు చేసింది కూడా.

అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని చెబుతున్నారు. అయితే రేవంత్ కి పీసీసీ పోస్ట్ దక్కడం వీహెచ్ కి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియా ముందుకొచ్చి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఠాకూల్ అమ్ముడుపోయారని ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆయనపై చర్యలకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయం పక్కనపెడితే.. రేవంత్ రెడ్డి అభిమానులు వీహెచ్ ని టార్గెట్ చేశారు. చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దీనిపై వీహెచ్ పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా పీసీసీ చీఫ్ ఉతమ్ కుమార్ రెడ్డిని కలిసి.. రేవంత్ రెడ్డి అభిమానులపై ఫిర్యాదు చేశారు. అభిమానులను రేవంత్ ఎందుకు నియంత్రించడం లేదని నిలదీశారు. రేవంత్, తన అభిమానులపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ను వీహెచ్ డిమాండ్ చేశారు.

పీసీసీ పోస్ట్ బీసీలకి ఇవ్వాలని వీహెచ్ కోరుతున్నారు. బీసీలకి ఇవ్వకపోయినా పర్వాలేదు రేవంత్ రెడ్డి మాత్రం ఇవ్వొదన్నది వీహెచ్ పంతం. కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చిన పర్వాలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు బీసీలకి పీసీసీ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నా వీహెచ్ నే.. పొన్నాల లక్ష్మయ్యని పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఓర్వలేదు. ఆయనపై తరచూ తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వీహెచ్ ఇప్పుడు బీసీల పాట పాడటం విడ్డూరం. అందుకే.. వీహెచ్ కు బీసీలు, సొంతం కమ్యూనిటీ మున్నూరుకాపులు కూడా సపోర్ట్ చేయడం లేదు. అందుకే వీహెచ్ ఒంటరైపోయారు. రేవంత్ రెడ్డి, ఆయన అభిమానులు ఒంటరిపోరాటం చేస్తున్నారు.