సితార పాపకు కరోనా టెస్ట్

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత మూడ్రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదీగాక.. తెలంగాణలోకి కొత్తరకం కరోనా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఇద్దరికి కొత్తరకం కరోనా సోకినట్టు గుర్తించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి ద్వారా మరెందరికి పాకింది అనేది ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారినపడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. మరో మెగా  హీరో వరుణ్ తేజ్ కి కూడా కరోనా సోకింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సితారనే తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. కరోనా టెస్టు చేయించుకుంటున్న వీడియోని షేర్ చేసింది.

‘నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. భయంగానే ఉన్నా అమ్మ పక్కనే ఉంది.. ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాను.. నా వయసు పిల్లలందరికీ చెప్తున్నాను కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు.. నాకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. మన ఆరోగ్యం, సమాజం కోసం అందరూ టెస్టులు చేయించుకోండి’ అంటూ పోస్ట్ చేసింది సితార. అన్నట్టు.. సితార స్టార్ హీరోయిన్ కేం తక్కువ కాదు. ఆమెకు బోలేడు ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు ఎప్పుడెప్పుడు వస్తాయా ? అనే ఎదురుచూసే ప్రత్యేక అభిమాన గణం ఉంది.