న్యూఇయర్ వేడుకలని ఎందుకు బ్యాన్ చేయలేదు.. హైకోర్ట్ ఆగ్రహం !
తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యూఇయర్ వేడుకలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రభుత్వాలు రాత్రి వేళ కర్ఫ్యూ విధించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం న్యూఇయర్ వేడుకల కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. మద్యం షాపులు అర్థరాత్రి 12గంటల వరకు, బార్లు, క్లబ్ లని రాత్రి 1గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
వార్తా పత్రికలు, మీడియా ఛానెల్స్ ద్వారా వచ్చిన వార్తలని సుమోటాగా స్వీకరించిన తెలంగాణ హైకోర్ట్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఓ వైపు కొత్త వైరస్ ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెబుతుంటే.. వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా బార్లు తెరిచి ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేశారని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. దీనిపై జనవరి 7న పూర్తి నివేదికను సమర్పించాలని కోరింది.