ఓటుకు నోటు కేసు : చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.  చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు.

అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో త్వరలోనే ఆయన అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.