మనోళ్లు రూల్స్ బ్రేక్ చేయలేదు
టీమిండియా ఆటగాళ్లు బయోబుడగ నిబంధనలు ఉల్లఘించారనే వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నవదీప్ సైని, శుభ్‌మన్ గిల్ మెల్బోర్న్ నగరంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడే ఉన్న నవదీప్‌సింగ్ అనే అభిమాని వారి చిత్రాలు, వీడియోలు ట్వీట్ చేశాడు.
తనకిష్టమైన ఆటగాళ్లకు ఎంతో సమీపంలో కూర్చున్నానని తెలిపాడు. క్రికెటర్లకు తెలియకుండానే వారి బిల్లు చెల్లించి రిషభ్ పంత్‌ను కౌగిలించుకున్నానని ట్వీటాడు. దాంతో టీమ్ఇండియా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిందని వార్తలొచ్చాయి. ఈ న్యూస్ ఆసీస్ మీడియా హైలైట్ చేసింది. భారత క్రికెటర్లు బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించారని ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన బీసీసీ ఆటగాళ్లకి మద్దతుగా నిలిచింది.
మన క్రికెటర్లు కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించలేదు. టీమ్ఇండియాలో అందరికీ కొవిడ్-19 ప్రొటోకాల్ తెలుసు. నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ ఆటగాళ్లు బయటకు వెళ్లి తమకిష్టమైనవి తినొచ్చు. రెండో టెస్టులో ఘోర ఓటమిని జీర్ణించుకోలేని ఆసీస్‌లోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. కొన్నిసార్లు అక్కడి మీడియా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అనుబంధంగా పనిచేస్తుంటుందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
ఇక నవదీప్‌సింగ్ అనే అభిమాని కూడా ఈ వ్యవహారంపై మరింత వివరణ ఇచ్చాడు. తాను భారత ఆటగాళ్లని కౌగిలించుకోలేదని ఆ అభిమాని క్షమాపణలు తెలియజేశాడు. తాను చెల్లించిన బిల్లుకు సైతం రోహిత్ శర్మ డబ్బులు ఇచ్చేశారని పేర్కొన్నాడు.