బాక్సింగ్ డే టెస్టు.. కరోనా బాంబ్

బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టుకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఆలస్యం వెలుగులోనికి వచ్చింది. ఈ టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన మెల్‌బోర్న్‌ ప్రభుత్వ యంత్రాంగం బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు గ్రేట్ సౌథర్న్‌ స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులను ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది.

“డిసెంబర్‌ 27న గ్రేట్‌ సౌథర్న్‌ స్టాండ్‌లోని జోన్-5లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల సమయంలో కూర్చున్న వీక్షకులు కరోనా టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలి. అయితే బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన సమయంలో ఆ సదరు వ్యక్తికి కరోనా సోకలేదు. ఆ తర్వాత అతడు మహమ్మరి బారిన పడ్డాడు. అయినప్పటికీ వైద్యశాఖ సూచనల మేరకు కొవిడ్‌ టెస్టులో నెగెటివ్ వచ్చేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలి. బాక్సింగ్‌ డే టెస్టులో ఆట ముగిసిన తర్వాత ప్రతిసారి మైదాన సిబ్బంది స్టేడియాన్ని శానిటైజ్‌ చేశారు” అని మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్‌ వెల్లడించింది.