గంగూలీ డిశ్చార్జ్ ఒకరోజు వాయిదా.. ఎందుకంటే ?

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ స్వల్పగుండెపోటుతో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదా కోల్ కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకున్నారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు ముందే ప్రకటించారు. కానీ గంగూలీ డిశ్చార్జ్ రేపటికి వాయిదా పడింది. ‘గంగూలీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ, దాదా ఈ రోజు కూడా ఆసుపత్రిలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి రేపు ఇంటికి వెళ్తాడు’ అని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాకి యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. గంగూలీ గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించిన వైద్యులు వాటిలో ఒకదాన్ని తొలగించడం కోసం స్టెంట్‌ వేశారు. తొమ్మిది మంది సభ్యుల సీనియర్‌ వైద్యుల బృందం దాదాకు చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. దేవీ శెట్టి కూడా మంగళవారం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. దాదా ఆరోగ్యంగా ఉన్నాడని, మునుపటిలా సాధారణ జీవితాన్ని గడుపుతాడని తెలిపారు.