సంచలనం : ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై విష ప్రయోగం
భారత అంతరిక్ష అధ్యయన సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనపై విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు. 2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందని తపన్ మిశ్రా అన్నారు. తాను తీసుకున్న దోశ, చట్నీలో ప్రమాదకర ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్‌ను కలిపారని ఆరోపించారు. దాని నుంచి కోలుకోవడానికి తనకి రెండేళ్ల సమయం పట్టిందని తెలిపారు.
ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని అన్నారు. దాని వల్లే వైద్యులు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విషప్రయోగం జరిగిన రెండు మూడు వారాలకే తాను చనిపోయేవాడినని చెప్పారు. గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని తపన్ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయం భయటపెట్టకూడదని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్. బేరసారలకు ప్రయత్నించారు. కానీ వాటిని తాను అంగీకరించలేదు. ఇప్పటికీ ఈ రహస్యాన్ని బహిర్గతం చేయకుండా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయని తపన్‌మిశ్రా ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. మిశ్రా వ్యాఖ్యలపై ఇంకా ఇస్త్రో గానీ కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు.