తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ అలర్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లలో బర్డ్‌ ఫ్లూ కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.

ఈ నేపథంలో తెలంగాణలోని పరిస్థితులపై మంత్రి తలసాని స్పందించారు. తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని కోళ్లలో ఇప్పటి వరకు వైరస్‌ ఆనవాళ్లు కనపడలేదని చెప్పారు. వినియోగదారులు, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పశుసంవర్థక శాఖ, పౌల్ట్రీ పరిశ్రమ సంయుక్త భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరిగే ఫ్లెమింగ్‌ ఫెస్టివల్‌కు 56 దేశాల నుంచి వలస పక్షులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్‌ సోకే సూచనలు ఉంటాయని.. మిగతా ప్రాంతాల్లో రావడానికి అవకాశం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.