కరోనా మూలాలపై పరిశోధన.. చైనా సహకరించడం లేదు : WHO
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ దేశాల నుంచి చైనా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా అజాగ్రత్త, సమాచారాన్ని పంచుకోవడంలో కావాలని నిర్లక్ష్యం చేయడం వల్లే మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సార్లు కరోనాను చైనా వైరస్‌గా అభివర్ణించారు.
వైరస్ పుట్టుకపై పరిశోధన జరిపేందుకు డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందానికి అన్ని అనుమతులు ఇస్తామని గతంలో చైనా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిశోధనకు సిద్ధమైన సంస్థ సభ్యులకు చైనాలోకి ప్రవేశించేందుకు ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వకపోవడంపై డబ్యూహెచ్ వో ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సభ్యులకు చైనా ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని తెలిసి నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇప్పటికే ఇద్దరు సభ్యులు వారి గమ్యస్థానాల నుంచి బయలుదేరారు. చైనా అధికారులు ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే నేను వారితో మాట్లాడాను. ఈ పర్యటన డబ్ల్యూహెచ్‌వోతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎంతో కీలకం అని తెలిపాను’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానోమ్ అన్నారు.