మూడో టెస్ట్ : ఆసీస్’దే ఆధిపత్యం

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ప్రమాదంలో పడింది. మూడోరోజు (శనివారం) 96/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మరో 148 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్‌ అజింక్య రహానె(22) విఫలమైనా పుజారా(50; 176 బంతుల్లో 5×4), రిషభ్‌ పంత్‌(36; 67 బంతుల్లో 4×4) నిలకడగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే వీరిద్దరు ఒకే ఒక్క పరుగు తేడాతో పెలివియన్ చేరడంతో.. టీమిండియా పతనం ప్రారంభం అయింది. ఆ తర్వాత అశ్విన్‌(10), సైని(3), బుమ్రా(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. చివర్లో జడేజా (28; 37 బంతుల్లో 5×4) ఎటాకింగ్ ఆడటంతో.. జట్టు స్కోర్‌ 244 పరుగులకు చేరింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కు 94 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ భారీ స్కోర్ దిశగా పరుగెడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (13)‌, విల్‌ పకోస్కి(10) తక్కువ స్కోరుకే అవుటైనా.. లబుషేన్‌(47; 69 బంతుల్లో 6×4), స్మిత్‌(29; 63 బంతుల్లో 3×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 94ని కలుపుకొని మొత్తం 197 పరుగుల ముందంజలో కొనసాగుతోంది. అద్భుతాలు జరిగితే తప్పా.. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం అసంభవమని చెప్పవచ్చు.