టీమిండియాకు డబుల్ షాక్.. ఇద్దరు ఆటగాళ్లకి గాయాలు !


ఆసీస్ టూర్ లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయపడిన షమి, కెఎల్ రాహుల్ టోర్ని నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా పంత్, జడేజా ఇద్దరు గాయపడ్డారు. మూడో టెస్ట్ మూడో రోజు బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరు గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా తొలుత పంత్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో గాయపడ్డాడు. బంతి అతడి ఎడమ మోచేతికి తగలడంతో నొప్పిని భరించలేక విలవిల్లాడాడు. వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించగా కాసేపు బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్‌ వార్నర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు.

రవీంద్ర జడేజా సైతం చివర్లో ధాటిగా ఆడుతూ గాయపడ్డాడు. అతడి ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. అయినా అలాగే బ్యాటింగ్‌ చేశాడు. చివరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. ఇక తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక వారిద్దరికీ వైద్య పరీక్షలు చేయించడానికి ఆస్పత్రికి తరలించినట్లు బీసీసీఐ ట్వీట్లు చేసింది.దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆరంభించగా, పంత్‌ స్థానంలో సాహా కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అలాగే జడేజా స్థానంలో మయాంక్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు.