కేటీఆర్ కు నిరసన సెగ
మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ నడిఒడ్డున నిరసన సెగ తగిలింది. కేటీఆర్ గో బ్యాక్ అంటూ భాజాపా నేతలు నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలంటూ కొద్ది రోజులుగా భాజపా నేతలు, కార్పొరేటర్లు పట్టబడుతున్నారు. తమకు ప్రొటోకాల్ కల్పించాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రగతి భవన్ ముట్టడికి సైతం యత్నించారు.
తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన తెలిపారు.దోమలగూడలో రూ.9.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు కేటీఆర్ శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్ది, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నారాయణగూడలో మోడల్ కూరగాయల మార్కెట్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు. రూ.4కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం అక్కడి నుంచి బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో రెండు పడకగదుల ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గో బ్యాక్ అంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్ “ఎన్నికల సమయంలో ఎవరి వాదన వారు చెప్పాం. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి తప్ప మరో పంచాయతీ అవసరం లేదు. కలిసి మెలసి పనిచేద్దాం. రాజకీయాల్లో పోటీ తత్వం ఉండాలి కానీ, అనవసర పంచాయతీ వద్దు. ప్రజలు కూడా అది హర్షించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తారు” అని అన్నారు.