విహారి (23*, 161 బంతుల్లో) ఇన్నింగ్స్.. సెంచరీతో సమానం !

మూడో టెస్టులో మొదటి నాలుగురోజులు ఆసీస్ దే  ఆధిపత్యం. ఐదోరోజు కూడా ఆరంభం ఆసీస్ దే. కెప్టెన్ రహానె (4)ని మరో పరుగు తీయకుండా అవుట్ చేసింది. కానీ పంత్‌(97) బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. పంత్ (97) ఉన్నంతసేపు.. 407 భారీ లక్ష్యాన్ని ఈజీగా చేధిస్తారు. విజయం భారత్ దే అనిపించింది. కానీ పంత్, పూజారా స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటికి భారత్ స్కోర్  272/5. ఇక ఓటమి తప్పదు అనుకున్న టైమ్ లో హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4×4), రవిచంద్రన్‌ అశ్విన్‌(39; 128 బంతుల్లో 7×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆసీస్ కు గెలుపుని దూరం చేశారు.

మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ మాట్లాడుతూ విహారిని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘సిడ్నీలో 400 స్కోర్‌ను ఛేదించడం అంత తేలిక కాదు. పంత్‌(97) బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే పంత్‌, పుజారా ఔటయ్యాక విహారి గాయపడ్డాక గెలుపు కోసం ప్రయత్నించడం చాలా కష్టం. ఆస్ట్రేలియాలో రాణించడం అంత తేలిక కాదు కాబట్టి విహారి తన బ్యాటింగ్‌ పట్ల గర్వపడొచ్చు. అతడి ఇన్నింగ్స్‌ శతకంతో సమానం. ఈ మైదానంలో అర్ధశతకం సాధించకుండా ఎప్పుడూ నేను ఆటను ముగించలేదని భోజన విరామంలో మా బ్యాటింగ్‌ కోచ్‌కు చెప్పాను. అలాగే ఈ రోజు కూడా బ్యాటింగ్‌లో రాణించాను’ అని చెప్పుకొచ్చాడు.