టీమిండియాకు మరో గాయం.. నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్
ఆసీస్ టూర్ లో టీమిండియాని గాయల బెడద వేటాడుతూనే ఉంది. ఇప్పటికే పేసర్లు మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. మరోవైపు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయపడడంతో నాలుగో టెస్టులో ఆడలేకపోతున్నారు. చివరి టెస్టులో మరో కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయని పీటీఐ తాజాగా పేర్కొంది. అతడికి పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
టీమ్ఇండియా తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన తర్వాత అద్భుతంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. బాక్సిండే టెస్టులో విజయం సాధించి కీలకమైన మూడో టెస్టును డ్రాగా ముగించింది. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో అద్వితీయ పోరాటం చేసిన విహారి (23*), అశ్విన్(39*) చివరి వరకూ వికెట్లు కాపాడుకొని ఆసీస్ విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో సిరీస్‌ను 1-1తో సమానంగా నిలిపారు. ఇక ఆఖరి టెస్టులో ఫలితం తేలాల్సి ఉంది.