రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ
నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది.
సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సుప్రీం సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరఫున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే, రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది ఎం.ఎల్.శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు.