రివ్యూ : మాస్టర్ – దూకుడు సగం వరకే

చిత్రం : మాస్టర్ (2021)

నటీనటులు : విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహన్‌, ఆండ్రియా తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

దర్శకత్వం : లోకేష్ కనగరాజు

నిర్మాత : జేవియర్‌ బ్రిట్టో

రిలీజ్ డేట్ : జనవరి 13, 2021.

కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాలవిక మోహనన్ హీరోయిన్‌. అర్జున్ దాస్, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మాస్టర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరీ.. భారీ అంచనాలకి మాస్టర్ అందుకున్నాడా ? అసలు మాస్టర్ కథేంటీ ?? తెలుసుకుందాం పదండీ.. !

కథ :

జేడీ (విజయ్‌) ఓ ప్రొఫెసర్. ఎలాంటి భయం బెరుకు ఉండదు. బాధ్యత కూడా తెలియదు. మందుకు బానిస. ఆయన పనులు కాలేజీలో మిగిలిన సిబ్బందికి నచ్చవు. కానీ స్టూడెంట్స్‌కు మాత్రం జేడీ హీరో. ఆయనంటే ప్రాణం. మరోవైపు భవాని(విజయ్‌ సేతుపతి) వరంగల్‌లో పేరు మోసిన రౌడీ. ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే అడ్డొచ్చిన వాళ్లను చంపుతూ పోతుంటాడు. తను చేసిన తప్పులను బాల నేరస్థుల జైలులో ఉన్న పిల్లలను వాడుకుంటాడు. చారులత (మాళవిక మోహనన్) కారణంగా భవానీ ఉండే వరంగల్‌లోని బాల నేరస్థులకు జేడీ పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అక్కడికి అయిష్టంగానే వెళ్లిన జేడీ.. భవానితో యుద్ధానికి దిగుతాడు. దానికి కారణమేంటీ ? భవానిపై జేడీ ఎటాక్ ఎలా ఉంటుంది ?? అన్నది మిగతా కథ.

ఎలా సాగింది ?
మాస్టర్ సింపుల్ కథ. రొటీన్ కమర్షియల్ కథనే. దాన్ని స్క్రీన్ ప్లే ప్రధానంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అలానే స్టార్ చేశాడు. ఫస్టాఫ్ ని పక్కాగా నడిపాడు. ప్రీ ఇంటర్వెల్ ఏపీసోడ్ అయితే అదిరిపోయింది. దీంతో సెకాంఢాఫ్ కూడా ఈ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ దర్శకుడు ట్రాక్ తప్పాడు. సెకాంఢాఫ్ పడిపోయింది. మాస్టర్ దూకుడు ఫస్టాఫ్ వరకే కొనసాగింది. సెకాంఢాఫ్ పడుతూ.. లేస్తూ సాగింది. ఫలితంగా మాస్టర్ సగం ఓకే అనిపించుకున్నాడు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయాయ్. కథ-కథనం పక్కనపెడితే.. విజయ్, విజయ్ సేతుపతి ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే కడుపునిండిపోయింది. వీరిద్దరిలో పై చేయి ఎవరిది ? అని అడిగితే చెప్పడం కష్టమే. కానీ విజయ్ సేతుపతి వైపే కాస్త మొగ్గు చూపొచ్చు. ఇక ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉంది. అది సినిమాకు మైనస్ గా మారింది.

ఎవరెలా చేశారు ?
మాస్ ని మెప్పించడంలో విజయ్ స్పెషలిస్ట్. మాస్టర్ గా కూడా మాస్ ని మురిపించాడు. కానీ క్లాస్ టచ్ లో మాస్ డోస్ కాస్త తగ్గిందని చెప్పాలి. మరోసారి స్టైలిష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.. మేనరిజమ్స్‌తో మ్యాజిక్ చేసాడు. ఈ సినిమాతో తన వయసు మరింత తగ్గించుకున్నాడు విజయ్. అంత యంగ్ లుక్‌లో కనిపించాడు. విజయ్ సేతుపతి మాత్రం స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి కరెంట్ పుట్టించాడు. విలనిజం అంటే ఇలా ఉంటుందా అనేలా కుమ్మేసాడు. మాళవిక మోహనన్ కనిపించేది తక్కువే.. అయినా ఆకట్టుకుంది. ఆండ్రియా కూడా బాగానే చేసింది. శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :
మాస్టర్ పాటలు బాగున్నాయ్. అనిరుధ్ బ్యాగ్రౌండ్ అదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ సినిమాలు 3 గంటలు ఉంటాయ్. అయితే మాస్టర్ కు అది మైనస్ గా మారింది. సెకాంఢాఫ్ బోరింగ్ గా సాగింది. చాలా సన్నివేశాలకి కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

* విజయ్, విజయ్ సేతుపతిల నటన

* ఫస్టాఫ్

* బ్యాగ్రౌండ్ మ్యూజిక్

* ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

* రొటీన్ స్టోరీ

* సెకాంఢాఫ్

* నిడివి

* స్క్రీన్ ప్లే

బాటమ్ లైన్మాస్టర్ దూకుడు సగం వరకే
రేటింగ్ : 2.75/5
నోట్ : ఈ రివ్యూ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.