నిర్మాత కాళ్లు మొక్కిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ కలం పదను గురించి తెలిసిందే. ఆయన మాటలు థియేటర్స్ దాటి మనతో పాటు మన ఇంటికి వస్తాయి. మనతో కలిసి నడుస్తాయ్. నడిపిస్తాయ్. మనం జీవనం, జీవితంలో భాగమైపోతాయ్. అందుకే త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటాం. ఇక త్రివిక్రమ్ స్పీచ్ కోసం ప్రత్యేకంగా వేచి చూస్తాం. ఆయన మాట్లాడుతున్న సేపు వర్షం కురిసినట్టుగా ఉంటుంది. ఆయన మాటల్లో కమ్మదనం, ప్రేమదనం, ఆవేశం.. సంతోషం… ఇలా అన్నీ ఉంటాయ్. అయితే త్రివిక్రమ్ మాట్లాడేటప్పుడు ఎమోషన్ అయిన సందర్బాలు చాలా తక్కువ. తొలిసారి త్రివిక్రమ్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. నిర్మాత స్రవంతి కిషోర్ కు పాదాభివందనం చేశారు. ఆయన నా జీవితం చాలా కీలకం అంటూ.. తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

“‘స్వయంవరం’ తర్వాత ఎందుకో నాకు ఎవరూ సినిమాలు ఇవ్వట్లేదు. అందుకే.. నేను భీమవరం వెళ్లి క్రికెట్‌ ఆడుకుంటుంటే ఫోన్‌ చేసి అక్కడి నుంచి పిలిపించి ‘నువ్వేకావాలి’ రాయించారు స్రవంతి రవికిషోర్‌. ఆ విషయంలో ఆయనకు చాలా రుణపడి ఉన్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సమయంలో నేను రాసిన ఫైల్‌ను ఆయన దగ్గర పెట్టుకొని రాత్రి 12 గంటలకు నాకు ఫోన్‌ చేసి చదివి వినిపించారు. అప్పుడు నాకు ఎలా ఉందంటే.. కాళిదాసు ఒకమాట చెప్తాడు.’అరసికేశు కవిత్వనివేదనం మా లిఖా.. మా లిఖా.. మా లిఖా’ అంటూ మూడుసార్లు చెప్తాడు. అంటే ‘రసికుడు కానివాడికి కవిత్వం చెప్పే ఖర్మ నా నుదిటి మీద రాయొద్దు రాయొద్దు రాయొద్దు’ అని అర్థం.

కానీ.. ఇంత రసికుడికి నాలుగు సినిమాలు రాసే అదృష్టం నాకు దక్కింది. ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి, అంతటి అనుభవించే సామర్థ్యం, జీవితం ఉన్న రవికిషోర్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన ఒక కో-డైరెక్టర్‌లాగా షెడ్యూల్‌ వేయడానికి ఇష్టపడతాడు. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌లాగా స్ర్కిప్టులో తప్పులుంటే దిద్దటానికి ఇష్టపడతాడు. సంగీత దర్శకుడి పక్కనే కూర్చొని ఆనందిస్తాడు. ఇంతటి రసికత ఉన్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్లకు సక్సెస్‌ రావాలి. సినిమా తెచ్చే డబ్బు ఆయనకు అవసరం లేదు. ఆ స్టేజిని ఆయన ఎప్పుడో దాటిపోయారు. కానీ.. సక్సెస్‌ ఆయనకు మరిన్ని సినిమాలు చేయాలనే కోరికను పెంచుతుంది. అందుకే అలాంటివాళ్లు సినిమాలు చేస్తుండాలి” అని త్రివిక్రమ్‌ అన్నారు.