నాల్గో టెస్ట్ : నిలిచిపోయిన ఆట
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(44; 74 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. లైయన్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి గాల్లోకి షాట్ ఆడిన అతడు మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 62 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. పూజారా 8, రహానె 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కెప్టెన్ టిమ్‌పైన్(50) అర్ధశతకం సాధించాడు. శనివారం 274/5తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టిమ్‌పైన్(50) అర్ధశతకం సాధించాక శార్దుల్ ఠాకుర్ వేసిన 100వ ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే కామెరూన్ గ్రీన్(47) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరుసటి ఓవర్‌లోనే మళ్లీ శార్దుల్ ఠాకుర్ బౌలింగ్‌లో కమిన్స్(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది.