బాలీవుడ్ స్టార్ హీరోకు నిరసన సెగ
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన వెబ్‌సిరీస్ ‘తాండవ్’ వివాదాస్పదం అయింది. ఈ వెబ్ సిరీస్ కు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మాత. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.
ఈ వెబ్ సిరీస్ పై భాజాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేశాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్ సిరీస్ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబయిలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలంటూ భాజపా ఎంపీ మనోజ్‌కుమార్ కొటక్ కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సోషల్ మీడియాలోనూ.. #బ్యాన్‌తాండవ్, #బాయ్‌కాట్‌తాండవ్ పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘తాండవ్’లో ఉద్దేశపూర్వంగా దేవుళ్లను ఎగతాళి చేశారని, సెక్స్, హింస, మాదకద్రవ్యాలు.. ఇలా అనేక రకాలుగా విద్వేశాలు రెచ్చగొట్టేలా వెబ్‌సిరీస్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.