నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.. తొలి సవాల్ !

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల వేళ నేతలు మాటల తూటాలు పేల్చారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విరుసుకున్నారు. ఇందులో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయ్. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా గెలిస్తే.. బండి పోతే బండి, కారు పోతే కారు.. హామీ అన్న హామీ హైలైట్ గా నిలిచింది. ఇక కేంద్రం నిధులపై చర్చకు మంత్రి హరీష్ విసిరిన సవాళ్లు కూడా ఆకట్టుకున్నాయి.

ఇక త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానున్న సంగతి తెలిసిందే. నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రచారం మొదలెట్టేందుకు పొలిటికల్ పార్టీలు రెడీ అయ్యాయ్. కాంగ్రెస్ అప్పుడే రంగంలోకి దిగిపోయింది. తాజాగా నాగార్జునసాగర్ లో మీడియాతో మాట్లాడిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమన్నారు కోమట్ రెడ్డి. అంతేకాదు… ఈ ఉప్పఎన్నిక‎లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడనని కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఐకేపీ సెంటర్లను మూసివేస్తే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను రైతులు ఉరికించి కొడతారన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అవినీతిపై బీజేపీ పార్టీ రాజీపడ్డా తాము మాత్రం కేసీఆర్‎ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మొత్తానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తొలి సవాల్ కాంగ్రెస్ నుంచి పడింది. ముందు ముందు సాగర్ కేంద్రంగా ఎన్ని సవాళ్లు, ప్రతిసవాళ్లు వినాల్సి వస్తుందో చూడాలి.