మమత సంచలన నిర్ణయం
తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ప్రస్తుతం భోవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కోల్‌కతలోని భోవానిపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు మమత వెల్లడించారు. అంటే.. రెండు స్థానాల నుంచి మమత పోటీ పడనున్నారు.
నందిగ్రామ్ మమతకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం. 2007లో నందిగ్రామ్‌లో సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మరణించారు. ఈ సంఘటన అప్పటి వరకూ లెఫ్ట్ చేతిలో ఉన్న అధికారాన్ని తృణమూల్ కాంగ్రెస్‌కు వచ్చేలా చేసింది. ఆ సమయంలో మమత మా, మాటి, మనుష్ (అమ్మ, మట్టి, మనుషులు) నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాతి ఎన్నికల్లో టీఎంసీ విజయకేతనం ఎగరేసింది.