అభిమానులకి పొలిటికల్ స్వేచ్ఛనిచ్చిన రజనీ

సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయ పార్టీని స్థాపించడం లేదని ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రజనీ అభిమానులు నొచ్చుకున్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేశారు. ఫైనల్ గా రజనీని అర్థం చేసుకొని కామ్ అయిపోయారు. రాజకీయంగా ఎవరి దారి వాళ్లు చూసుకొనే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో రజనీ స్థాపించిన ‘మక్కల్ మంద్రమ్’ సభ్యులు ఒక్కొక్కరుగా వివిధ పార్టీలో చేరిపోతున్నారు.

తాజాగా కొన్ని జిల్లాల బాధ్యులు డీఎంకేలో చేరిపోయారు. మూడు జిల్లాలకు చెందిన కార్యదర్శులు, ఏజే స్టాలిన్ అనే ముఖ్య నేత రజనీ పార్టీకి రాజీనామా చేసి.. ఇటీవలే డీఎంకేలో చేరిపోయారు. వీరితో పాటు టూటీకోరిన్, రామంతపురానికి చెందిన జోసెఫ్ స్టాలిన్, సెంథిల్ సెల్వానంద్‌తో పాటు థేనీ జిల్లాకు చెందిన గణేశన్ కూడా డీఎంకేలో చేరిపోయారు. వీరందరూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో పార్టీలో చేరారు. దీనిపై రజనీకాంత్ స్పందించారు. మక్కల్ మంద్రమ్ బాధ్యతల్లో ఉన్నవారు ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని, మిగితా పార్టీలో కూడా చేరే స్వేచ్ఛ వారికుందన్నారు. మొత్తానికి.. అభిమానులకి రజనీ పొలిటికల్ స్వేచ్చనిచ్చారు అన్నమాట.