జూన్ వరకు విద్యా సంవత్సరం పొడగింపు

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. మొదట 9వ తరగతి ఆపై తరగతులని తెరవనున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని తరగులని తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

ఈ సందర్భంగా పాఠశాలల ప్రతినిధులు పలు సమస్యలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కరించాలని కోరారు. అలాగే పలు సూచనలు కూడా చేశారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని.. కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. ఇక విద్యా సంవత్సరం, సెలబస్ తగ్గింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.