అమరావతి ఉద్యమం @400 డేస్
ఏపీ రాజధాని ‘అమరావతి ఉద్యమం’ 400ల రోజులకి చేరింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇందుకోసం వేల ఎకరాలు సేకరించారు. వాటిలో కొన్ని తాత్కాఌక, మరికొన్ని శాశ్వత కట్టడాలు నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని వికేంద్రీకరణ బిల్లుని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
దీని ప్రకారం ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకి తరలిపోనుంది. హైకోర్టుని కర్నూలుకు తరలిస్తారు. అమరావతి శాసన రాజధానిగా ఉండనుంది. అయితే దీనిని అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వీరికి తెదేపా, జనసేన, బీజేపీలు మద్దతులు తెలిపారు. ఇప్పుడు.. అమరావతి ఉద్యమం 400ల రోజులకి చేరుకుంది.
ఈ సందర్భంగా విజయవాడలోని గొల్లపూడి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సిద్ధమయ్యారు. దీంతో గొల్లపూడిలో, ఉమా నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. హైకోర్టుని కర్నూలుకు తరలించేందుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాని కోరినట్టు తెలుస్తోంది.