కరోనా టీకా తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే.. ?
దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ ప్రారంభం అయింది. మొదట కరోనా వారియర్స్ కి వాక్సిన్ ఇస్తున్నారు. ఆ తర్వాత సామాన్యులకి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నవారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదనిచెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. వాక్సిన్ తీసుకున్న 15 రోజుల తర్వాత యాంటీ బాడీస్ వృద్ది ఉంటుంది.. అందు వలన మద్యం తీసుకుంటే..అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుంది చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మందు బాబులకి కరోనా వాక్సిన్ కష్టాలు తప్పేలా లేవు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో మద్యం దొరక్కపోతే మందు బాబులు గిలగిలాడిపోయారు. ఆఖరికి శానిటైజర్స్ కూడా తగారు. దానికి కారణంగా పలువురు మృతి చెందారు. అలాంటిది కరోనా టీకా కోసం మందు బాబులు మద్యం మానేస్తారా ? అన్నది అనుమానమే !
కరోనా టీకా గురించి.. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ.. “ముప్పై రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు తీసుకోవాలి. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే.. అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుంది. ఇది పూర్తిగా వాస్తవం. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడిస్తుంది. అందువల్ల టీకా తీసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే తీసుకున్న వారు ఓ 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మేలు’’ అన్నారు.