తెదేపాకు ఎన్నికల వ్యూహాకర్త.. బాబు బుర్ర పనిచేయట్లేదా ?

చంద్రబాబు నాయుడు – 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. ఆయనకు రాజకీయ చాణిక్యుడిగా పేరుంది. అలాంటి చంద్రబాబు కూడా రాజకీయ సలహాదారుడిని నియమించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. అవునూ.. తెదేపా రాజకీయ సలహాదారుడిని నియమించుకుంది. గతంలో రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్‌ వ్యవస్థాపకుడు పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) టీమ్ లో పనిచేసిన రాబిన్‌ శర్మ తెదేపా కోసం పని చేస్తున్నారు.

గత యేడాది కాలంగా ఆయన తెదేపాకు వ్యూహాలు అందిస్తున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక కోసం ఆయన పూర్తి స్థాయిలో పని చేయనున్నారు. ఆ తర్వాత కూడా ఆయన్ని కొనసాగించనున్నారు. 2024 ఎన్నికల కోసం ఆయన వ్యూహాలనే అమలు చేయబోతున్నట్టు సమాచారమ్. గతంలో రాజకీయ వ్యూహా కర్తలని చంద్రబాబు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

రాజకీయ పరిణతి లేనివారే కన్సల్టెంట్‌ను పెట్టుకుందని అనేవారు. ఇక తెదేపా నేతలైతే.. చంద్రబాబు  ఒక్కడే వందమంది పీకేలతో సమానం. బాబు రాజకీయ చతురత ముందు పీకే వ్యూహాలు పనిచేయవని చెప్పుకొనేవారు. కానీ వారి అంచనాలు, నమ్మకాలు తలక్రిందులయ్యాయ్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు వ్యూహాలు పని చేయలేదు. తెదేపా చిత్తు చిత్తుగా ఓడింది. నమ్మకం పెట్టుకున్న కొడుకు లోకేష్ కు రాజకీయ పరిజ్జానం అంతగా లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కన్సల్టెంట్‌ను పెట్టుకోక తప్పలేదు.