ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్.. ప్రత్యేక ప్రార్థనలు !
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు. తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లి తన మాతృమూర్తిని కలిశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే సిరాజ్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన వారం రోజుల్లోనే అతడి తండ్రి మహ్మద్ గౌస్ నగరంలో కన్నుమూశారు. క్వారంటైన్ ఆంక్షలు, టీమ్‌ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కలను నిజం చేసేందుకు అతడు హైదరాబాద్‌కు తిరిగి రాలేదు. తండ్రి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. తీవ్ర భావోద్వేగాలు కలుగుతున్నప్పటికీ అక్కడే ఉన్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు. టెస్టు సిరీస్‌లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు.
‘నేరుగా నేనింటికి వెళ్లలేదు. విమానాశ్రయం నుంచి శ్మశానికి వెళ్లిపోయాను. అక్కడ కూర్చొని కొంత సమయం మా నాన్నతో గడిపాను. నేను ఆయనతో మాట్లాడలేకపోవచ్చు కానీ సమాధి వద్ద పుష్ఫగుచ్ఛం సమర్పించాను. ఆ తర్వాత ఇంటికొచ్చాను. అమ్మను కలిసిన వెంటనే ఆమె ఏడ్చింది. ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. ఇదో వింత అనుభూతి. ఆరు నెలలుగా ఆమె నాకోసం ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు నేను ఇంటికి తిరిగొస్తానా అని రోజులు లెక్క పెట్టింది’ అని సిరాజ్ అన్నాడు.