గుడ్ న్యూస్ : పెట్రో ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు

గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు సమాచారం.

గతేడాది అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం దేశంలో ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు ఇంధన ధరలు మండిపోతుండటంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజాగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయ్. పెట్రోల్‌, డీజిల్‌పై 25పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.85.70కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.92.28గా ఉంది. హైదరాబాద్‌లోనూ 26పైసలు పెరిగి రూ.89.15కు చేరింది.
పెరిగిన ధరలతో లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.75.88, ముంబయిలో రూ.82.66, హైదరాబాద్‌లో రూ.82.80గా ఉంది.