పశ్చిమ గోదావరిలో పెరుగుతున్న వింత వ్యాధి బాధితుల సంఖ్య

గత యేడాది చివరలో ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలవరం రేపిన సంగతి తెలిసిందే. మొత్తం 622 మంది వరకు ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇక ఇటీవల ఇదే తరహా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండల కొమిరేపల్లిలో వింత వ్యాధి సోకుతోంది. బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న 25 మంది అస్వస్థతకు గురికాగా.. తాజాగా మరో నలుగురు కళ్లు తిరగడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు.

గురువారం రాత్రి కొమిరేపల్లిలో తొలి కేసు నమోదైంది.  శుక్రవారం కొత్తగా 24 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. వీరిలో 21 మంది కోలుకోగా నలుగురు చికిత్స పొందుతున్నారు. మూడు చోట్లా బాధితులందరిలోనూ కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే వీరిలో ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పారు.