కరోనా బారినపడినవారు సంతోషించే న్యూస్

కరోనా బారినపడి కోలుకున్న వారికి గుడ్ న్యూస్. వారిలో  వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి దీర్ఘ కాలం ఉండడంతో పాటు కొత్తరకం వైరస్‌లను కూడా నిరోధించగలిగే సామర్థ్యం ఉన్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. అంతేకాకుండా, రోగనిరోధకశక్తితో వచ్చే యాంటీబాడీలు ఎక్కువకాలం పాటు ఉండడం, కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యాలను కలిగి ఉండటం ఊరట కలిగించే విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పరిశోధనలో భాగంగా, వైరస్‌ సోకిన నెల తర్వాత బాధితుల యాంటీబాడీల స్థాయిని పరిక్షించిన నిపుణులు, మరో ఆరు నెలల అనంతరం వాటి ప్రతిస్పందనలను పరీక్షించారు. యాంటీబాడీల పరిమాణం తగ్గినప్పటికీ, కీలకమైన మెమొరీ బీ కణాల్లో తగ్గుదల కనిపించలేదని నిపుణులు గుర్తించారు. అంతేకాకుండా, కొన్నిసమయాల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరడగమే కాకుండా..అసలైన వాటికంటే ఈ యాంటీబాడీలకే ఎక్కువ సమర్థత ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా, కోలుకున్న వారు మరోసారి వైరస్‌కు గురైనప్పుడు ఇవి వేగంగా ప్రతిస్పందించడమే కాకుండా, వాటిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందని అంచనా వేశారు.