TSలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. అవన్నీ భర్తీ చేస్తారా ?

నిరుద్యోగులు, ఉద్యోగులకి ఒకేసారి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు ఉద్యోగాల భర్తీ, అటు ఉద్యోగులకు ప్రమోషన్స్ ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికని విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీలపై తన నివేదికలో స్పష్టతనిచ్చింది.

తెలంగాణలో మొత్తం మంజూరైన పోస్టులు 4,91,304 పోస్టుల ఉండగా..  అందులో కేవలం 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. అయితే మొత్తం 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని పీఆర్సీ తన నివేదికలో స్పష్టం చేసింది. అంటే రాష్ట్రంలో మొత్తం 39 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయని వేతన సవరణ సంఘం తేల్చింది. రాష్ట్రంలో ప్రతీ వేయి మంది 14 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. కానీ అనేక పోస్టులు ఖాళీగా ఉండడంతో వేయి మందికి కేవలం 8.5 శాతం మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా ? లేక.. దశల వారీగా వాటిని భర్తీ చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 20 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరో పది వేల వరకు విద్యాశాఖలో ఉన్నట్లు సమాచారం. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 50,400 మంది కాంట్రాక్ట్, 58,128 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.