బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి.. శిఖర్‌ ధావన్‌పై చార్జ్‌షీట్ ! 


టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చిక్కుల్లో పడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కారణమయ్యారనే ఆరోపణలతో.. ఆయనపై ఏకంగా ఛార్జ్ షీటు దాఖలైంది. గతవారం ధావన్ వారణాసి పర్యటనుకు వచ్చాడు. సరదాగా ఓ బోటులో తిరుగుతూ అక్కడి పక్షులకు ఆహారం వేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ధావన్ పేర్కొన్నాడు.

ఈ ఫోటోలు వైరల్‌ కావడంతో వారణాసి కలెక్టర్‌ స్పందించారు. ధావన్‌ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. మరోవైపు దేశంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్‌ పక్షులకు ఆహారం వేయడం ఏంటంటూ సిద్దార్థ్‌ శ్రీవాత్సవ అనే లాయర్‌ అతనిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. లాయర్‌ చార్జ్‌షీట్‌తో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ త్రితియా దివాకర్‌ కుమార్‌ గురువారం ధావన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఫిబ్రవరి 6న జరపనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు.