టెలివిజన్‌ చట్టాల్లో మార్పులకి ఆదేశం

టెలివిజన్‌కు సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. గతేడాది ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానెల్స్‌ ఈ అంశాన్ని వక్రీకరించి ప్రసారం చేశాయని జమైత్‌ ఉలేమా-ఐ హింద్‌, పీస్‌ పార్టీ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాయి.

ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌కు నోటీసులు పంపింది. హింసను ప్రేరేపించే విధంగా ప్రసారమయ్యే టెలివిజన్‌ కార్యక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. టెలివిజన్‌కు సంబంధించిన చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరముందని సుప్రీం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వం ప్రస్తుతమున్న ‘కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌’ లో సమూల మార్పులు చేయాలి అని సుప్రీం పేర్కొంది.