గంగూలీకి మరో రెండు స్టెంట్స్

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో బుధవారం దాదాను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.గురువారం ఆయనకు వరుసగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం చర్చించి స్టెంట్లు వేసేందుకు నిర్ణయించారు. గురువారం సాయంత్రం యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. పూడుకుపోయిన గుండె రక్తనాళాల్లో మరో రెండు స్టెంట్లను అమర్చామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం దాదా ఆరోగ్య పరిస్థితి అత్యంత నిలకడగా ఉందని వెల్లడించాయి. ‘గంగూలీ గుండెరక్తనాళాల్లో పూడికలు తొలగించేందుకు రెండు స్టెంట్లు అమర్చాం’ అని వైద్యులు పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో గుండెనొప్పి రావడంతో గంగూలీ మొదటిసారి ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు అప్పట్లో వైద్యులు గుర్తించారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట ఒక స్టెంట్‌ అమర్చారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో మిగతా చోట్ల స్టెంట్‌ వేయడాన్ని వాయిదా వేశారు. తాజాగా మిగితా రెండు స్టెంట్స్ ని వేశారు.