తరగతి గది ఆక్యుపెన్సీ 50 శాతమే

కరోనా జాగ్రత్తల్లో భాగంగా తొలుత 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరచుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని సవరిస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి 50శాతం కంటే ఎక్కువగా థియేటర్స్ నింపుకోవచ్చని తెలిపింది. అయితే ఫిబ్రవరి 1 నుంచి మొదలు కానున్న స్కూల్స్ కు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనని పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అవునూ.. ఫిబ్రవరి 1 నుంచి 9,10, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు తెరచుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యాకోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోజూ శానిటైజేషన్‌ చేపట్టేందుకు ప్రతి విశ్వవిద్యాలయానికి రూ.20 లక్షలు తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు.