అరెస్ట్ వారెంట్’పై శంకర్ ఆవేదన
భారతదేశం గర్వంచదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఈ గ్రేట్ దర్శకుడిపై చెన్నై ఎగ్మోర్ క్రైం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై శంకర్ స్పందించారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వార్తలు తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేశాయని, ఇదే విషయంపై తన న్యాయవాది సాయికుమార్‌తో కలిసి చెన్నై ఎగ్మోర్ కోర్టు మేజిస్ట్రేట్‌ను సంప్రదిస్తే.. ఎలాంటి వారెంట్ జారీచేయలేదని తెలిపారు.
బహుశా.. కోర్టు ఆన్‌లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి వుండొచ్చని.. ఇపుడు ఆ పొరబాటును సరిదిద్దుతున్నట్టు చెప్పారు. ఇలాంటి వార్తలను ఎలాంటి నిర్థారణ చేయకుండా ప్రచురించడం తమను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ వార్త వల్ల తన కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు అనవసరంగా మనోవేదనకు గురిచేసింది. ఇలాంటి వార్తలని ప్రచురించేటప్పుడు నిజనిర్థారణ చేసుకుంటే మంచిదని శంకర్ పేర్కొన్నారు.