ఆ హీరోని పట్టిస్తే రూ. లక్ష రివార్డ్
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై రైతు జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. దాంతోపాటు సిక్కుల జెండా కూడా ఎగిరింది. ఈ రెండు జెండాలు ఎర్రకోటపై ఎగరడంలో ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్దు కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన తర్వాత సిద్ధు అజ్ఝాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సిద్ధు కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధు గురించి సమాచారం తెలిపిన వారికి నగదు ప్రోత్సాహకం అంజేస్తామని పోలీసులు ప్రకటించారు.
దీప్ సిద్దుతో పాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుజ్రంత్ సింగ్‌ని పట్టిస్తే రూ. లక్ష క్యాష్ రివార్డ్ ఇస్తామని చెప్పారు. ఇక జజ్‌బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఎక్కడ ఉన్నారో చెబితే రూ. 50వేలు అందజేస్తామని తెలిపారు. జనవరి 26 హింసాత్మక ఘటనల్లో 300కు మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 44 ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారు. 122 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రైతు నేతలు, ఆందోళనకారులకు నోటీసులు జారీచేశారు. అయినా… స్పందించకపోవడంతో వారిపై రివార్డ్ ప్రకటించి మరీ.. గాలిస్తున్నారు.
మరోవైపు రైతుల నిరసనపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. ఏకధాటిగా 15 గంటల పాటు చర్చించేందుకు అధికార-ప్రతిపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. శుక్రవారం రైతుల నిరసనపై చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది.