కేటీఆర్ ని వద్దు ఈటెలని సీఎం చేయండి

కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలని తప్పుకోనున్నారు. కొడుకు కేటీఆర్ కి పగ్గాలు అప్పగించనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయింది. ఈ నెల 18నే కేటీఆర్ పట్టాభిషేకం అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి దళితులని మోసం చేశారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. కనీసం రెండోసారైనా దళితుడిని సీఎం చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయ్.

అంతేకాదు.. సీఎం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా అర్హుడు ఈటెల రాజేందర్ మాత్రమేనని అంటున్నారు. తాజాగా ఈటెలని సీఎం చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కేటీఆర్ ని వద్దు ఈటెలని సీఎం చేయండని ‘తెలంగాణ ఇంటి పార్టీ’ అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక, బీసీలకు న్యాయం జరుగుతుందని సోనియాగాంధీ భావించారని.. అయితే, దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న కేసీఆర్, తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. మొదట్లో కేటీఆర్ సీఎం అంటే పెద్దగా వ్యతిరేక స్వరం వినిపించలేదు. కానీ క్రమక్రమంగా కేటీఆర్ ముఖ్యమంత్రి ఏంటీ ? సీనియర్ నేత ఈటెల ఉన్నాడు అంటూ గొంతుకలు కలుస్తున్నాయ్. మరీ.. ఈ నినాదం బలపడి.. గులాభి పార్టీలోనూ నిరసనగళం పుట్టుకొస్తుందేమో చూడాలి.