పవన్ చేతికి జానీ ఖర్చీప్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ‘జానీ’ సినిమా ప్రత్యేకమైనది. ఎందుకంటే కేవలం 29 ఏళ్ల వయసులోనే దర్శకుడిగా మారి జానీ చేసాడు పవన్. బాహుబలి సినిమా ఇప్పుడెంత హడావిడి చేసిందో.. ఆ సమయంలో జానీ కూడా అంతే రచ్చ చేసింది. ఈ సినిమా కోసం అభిమానులు పిచ్చోళ్లలా వేచి చూసారు. కానీ జానీ ప్రేక్షకులని నిరాశపరిచింది. అయితే జానీ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆ సినిమా సమయంలో పవన్ వాడిన ఖర్చీఫ్‌లు, టవల్స్, కాస్ట్యూమ్స్ అన్నీ రికార్డులు తిరగరాసాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా వాటి కోసం ఎగబడ్డారు అభిమానులు.

మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత అలాంటి కర్చీఫ్‌తో కనిపించాడు పవన్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానాతో పవన్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ షూటింగ్ లో జానీ ఖర్చీఫ్ తో కనిపించాడు పవర్ స్టార్. సెట్స్ లో ఉన్నపుడు పవన్ తన చేతికి జానీ ఖర్చీఫ్ కట్టుకున్నాడు. క్యారీ వ్యాన్ పక్కన కూర్చుని పవన్ ఇచ్చిన ఆ పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో పాటు పవన్ వింటేజ్ లుక్ కూడా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక పవన్ వకీల్ సాబ్ షూటింగ్ ని పూర్తి చేశారు. క్రిష్ సినిమా సెట్స్ కొంత మేరకు షూటింగ్ జరుపుకుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ లెక్కన ఈ యేడాదియే పవన్ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి.