ఈటెల వ్యాఖ్యల ఆంతర్యం ఏంటీ ?

మంత్రి కేటీఆర్ కు అతి త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18నే కేటీఆర్ కు పట్టాభిషేకం అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తెరాస కార్యవర్గం సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్న విషయాన్ని ప్రస్తావించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడానికి ఈటెల అడ్డుగా మారుతున్నారు. మంత్రి హరీష్ కూడా కేటీఆర్ కు పోటీయే. కానీ హరీష్ కంటే ఈటెల సీనియర్. అందుకే ఈటెలని సీఎం చేయాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఈటెలలోనూ సీఎం పదవి కాంక్ష ఉన్నట్టుంది. గత మూడ్నాలుగు రోజులుగా ఈటెల తీరు మారింది. మంగళ, బుధ, గురువారాల్లో సొంత నియోజకవర్గంలో రైతు వేదికల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఈటెల.. తాను మీ వాడిని.. మీ బిడ్డను అని చెప్పుకుంటున్నారు. కానీ పార్టీ ప్రస్తావన తీసుకురావడం లేదు. అంతేకాదు.. ఆయన మెడలో గులాభి కండువ కూడా ఉండటం లేదు.

రైతు వేదిక కాబట్టి పచ్చ కండువ కప్పుకున్నాడు అనుకున్నా.. ఈటెల మాటల్లోనూ తెరాసపై మునుపటి ప్రేమ కనిపించలేదు. రైతుబంధులోని లోపాలని కూడా ఈటెల ప్రస్తావించడం విశేషం. రైతుబంధు మంచి పథకమే. కానీ కొండలు, గుట్టలు, వ్యాపారస్తుల భూములకి రైతుబంధు ఇవ్వకూడదని ప్రజలు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈటెల అన్నారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్ నచ్చిందే చేస్తడు. ఎవ్వరి మాట వినడని చెప్పుకొచ్చారు. నేను ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా.. మీ బిడ్డను. రైతు బిడ్డను. 20యేళ్లుగా ఆదరిస్తున్నారు. గెలిపిస్తున్నారు. ఏ పార్టీలో.. ఏ స్థాయిలో ఉన్నా రైతుల కోసం పని చేస్తానని చెపుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈటెల పార్టీ మారడానికి కూడా మానసికంగా రెడీ అవుతున్నారని విశ్లేషిస్తున్నారు.